Wednesday, 23 December 2015

లక్ష్యాన్ని తేల్చుకోలేకా, మార్గాన్ని ఎంచుకోలేకా, మంచిచెడుల్ని బేరీజు వేసుకోలేకా, జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోలేకా ఉక్కిరిబిక్కిరైపోతున్న ఆధునిక మానవుడికి భగవద్గీత ఓ కర్తవ్యదీక్షోపదేశం. ఐటీ కొలువులు చేస్తూనే, బిజినెస్‌ పరుగులు తీస్తూనే, అమెరికా కలలు కంటూనే ఓ యోగిలా ఎలా జీవించవచ్చో పరమాత్మ బోధించాడు. హృదయమే వాటికగా జరిగే మనోయజ్ఞం గీతాకృష్ణుడి కర్మయోగం 
(డిసెంబరు 21న గీతా జయంతి).
ఎందుకంత కష్టపడతావ్‌? ఎన్నాళ్లని శ్రమిస్తావ్‌? ఎన్ని వందనోట్లు పోగేస్తే కోటి రూపాయలు కావాలీ? దొడ్డిదారి ఎంచుకో. లంచాలు తీసుకో. దందాలు చేసుకో. నమ్మినవాళ్లను నట్టేట ముంచెయ్‌. దొంగ లెక్కలు చూపించైనా సరే వ్యాపారవేత్తగా ఎదిగిపో. ఎలా గెలిచావో ఎవరిక్కావాలీ, గెలిచావా లేదా?ఏ గడ్డి తిన్నావో ఎవరు చూస్తారూ, సంపాదించావా లేదా?
- ఇది కలిపురుష గీత. దుర్యోధన దృక్పథం. దుశ్శాసన భావజాలం. అనేకానేక ప్రభావాలతో...మనలోని మానవత ధృతరాష్ట్రుడిలా గంతలు కట్టుకుంటోంది. కర్ణుడిలోని దాతృత్వకోణాన్ని దుర్జనసాంగత్యమనే విషప్రభావం మింగేసినట్టు...సమాజంలో ఏమూలనో బిక్కుబిక్కుమంటున్న మంచిని భావ కాలుష్యం కబళిస్తోంది. సమకాలీన వ్యవస్థలో పెచ్చుమీరిన అవినీతికైనా, హద్దులు దాటిన హింసకైనా, అర్థంలేని అసహనానికైనా, బంధాల బీటలకైనా కౌరవతత్వమే కారణం.
అర్జునుడు ఆయుధాన్ని జారవిడిచిన్నట్టు...ఆధునిక మానవుడు ఆత్మవిశ్వాసాన్నీ ఆశావాదాన్నీ వదిలేసుకుంటున్నాడు. భ్రమల వూబిలో చిక్కుకుంటున్నాడు. భయాల బందిఖానాలో ఖైదీ అవుతున్నాడు. ఇంకెంత కాలమీ అజ్ఞానారణ్యవాసం. మనసును ధర్మక్షేత్రంగా మలుచుకుని, కురుక్షేత్ర సంగ్రామానికి శంఖం పూరించాల్సిందే. ఆత్మవిశ్వాసమనే పాశుపతంతో అంతశ్శత్రువుల్ని తరిమికొట్టాల్సిందే.
విరాట్‌ స్వరూపంలో కృష్ణభగవానుడదిగో... 
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే...మనిషిని మనిషిగా బతికించడానికి తానూ ఓ మనిషై పుట్టిన మహాదేవుడు! 
కార్పణ్యదోషోపహతస్వభావః 
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః...
కృష్ణా! అజ్ఞానం మమ్మల్ని కమ్మేసింది. ఏది ధర్మమో, ఏది అధర్మమో తేల్చుకోలేకపోతున్నాం. మాకు మంచిని బోధించు, శ్రేయస్కరమైన మార్గాన్ని చూపించు - అని వేడుకుందాం. పాండవుల్ని గెలిపించినట్టే, మనల్నీ ఒడ్డునపడేస్తాడు. అర్జునుడి రథాన్ని సమ్యక్‌ మార్గంలో నడిపించినట్టే, మన బతుకుబండినీ దార్లో పెడతాడు. తామరాకు మీద నీటి బిందువులా...నిత్యజీవితంలో ఒడుపుగా నెట్టుకురావడమెలాగో నేర్పుతాడు.
* * *
భగవద్గీత... 
మూడో అధ్యాయం... 
కర్మయోగం... 
శ్రీకృష్ణపరమాత్మ అడవులకెళ్లిపోయి తపస్సు చేసుకోమని ఆదేశించడు. బంధాల్ని వదిలేసుకుని కాషాయం కట్టుకోమని సలహా ఇవ్వడు. పూజలూ వ్రతాలూ ఉపవాసాలూ హోమాల ప్రస్తావన తీసుకురాడు. బతుకు బుద్భుదప్రాయమని పెదవి విరిచేయడు. సంసారం దుఃఖసాగరమని నిరాశపరచడు. ఆనందవిషాదాల నడుమే, గెలుపోటముల మధ్యే ఓ యోగిలా బతకడం సాధ్యమేనంటాడు. ఏం ఫర్వాలేదు. నువ్వో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయితే ప్రోగ్రామింగే నీ ముక్తిమార్గం. నువ్వో బ్యాంకు ఉద్యోగి అయితే, డెబిట్‌-క్రెడిట్‌లే నీ జపతపాలు. నువ్వు గృహిణివైతే వంటిల్లే నీ ధ్యానకేంద్రం - అని ధైర్యం చెబుతాడు. హృదయాన్ని వాటికగా చేసుకుని కర్మల్ని ద్రవ్యాలుగా సమర్పించి మనోయజ్ఞం చేయమంటాడు. భక్తితోనో, జ్ఞానంతోనో, వైరాగ్యంతోనో సాధించగలిగే ఆధ్యాత్మిక ప్రగతి...‘కర్మయోగ’ జీవనశైలితోనూ సాధ్యమని ప్రకటిస్తాడు.
కర్మ...పనిచేయడం. 
అకర్మ...ఏపనీ చేయకపోవడం. 
సకామ కర్మ...ప్రతిఫలాన్ని ఆపేక్షించి పనిచేయడం. 
నిష్కామ కర్మ...ఎలాంటి ఫలాపేక్షా లేకుండా పనిచేయడం. 
- ఈ నాలుగు అంశాల చుట్టే కర్మయోగమంతా పరిభ్రమిస్తుంది. నడవడం ఓ కర్మ, తినడం ఓ కర్మ, నిద్రపోవడం ఓ కర్మ. జీవితమంటే అనేకానేక శారీరక, మానసిక కర్మల సమాహారం. కర్మ మనిషి సహజ స్వభావం. ‘న హి కశ్చిత్‌ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్‌’ - కర్మ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేం. చేస్తూ ఉండాల్సిందే. కర్మ ఎటూ తప్పదు కాబట్టి, ఆ చేసేదేదో మంచి కర్మలు చేయమంటాడు. ఎంత మంచి కర్మలైనా కాస్తోకూస్తో ఫలాపేక్ష ఉంటుంది. ఆ ‘ఆసక్తి’ని తుంచేసుకోమంటాడు, ‘ఆ బంధాన్ని’ వదిలేసుకోమంటాడు.
విద్యుత్‌ సరఫరాలో ఏదో సమస్య వస్తుంది. ఇల్లంతా చీకటి. నేరుగా వెళ్లిపోయి ఫ్యూజ్‌ బాక్సులో చేయి పెడతామా? కరెంటు కరిచేయదూ! అలా అని వెలుతురును కోరుకోకుండానూ ఉండలేం. చేతికి రబ్బరు తొడుగు వేసుకుని పని మొదలుపెడతాం. ఆపాటి జాగ్రత్త ఉంటే, విద్యుదాఘాతాలు మనల్నేమీ చేయలేవు. అదే నైపుణ్యమంటే! నిత్య కర్మల్లోనూ అంతటి కౌశలాన్ని ప్రదర్శించు. యోగః కర్మసు కౌశలం.
నియతం కురు కర్మత్వం...పని చేయి. కష్టపడి పనిచేయి. మహా నైపుణ్యంగా పనిచేయి. అదే ప్రపంచమన్నట్టు పనిచేయి. ఎవరూ వేలెత్తి చూపనంత గొప్పగా పనిచేయి. ఎవరూ అజమాయిషీ చేయాల్సిన అవసరమే లేకుండా పనిచేయి. ఆ పన్లోనే ఆనందాన్ని అనుభవించు. అంతే, అంతవరకే నీ బాధ్యత.

మస్త ప్రాణుల్లోని ఆత్మా, తన ఆత్మా ఒకటేనని తెలుసుకోగలిగితే...ఏ కర్మలూ బంధించలేవు. అలాంటివారి మనసు శుద్ధంగా ఉంటుంది, ఇంద్రియాలు కూడా ఏమీ చేయలేవు. ఆ మనోవికాసమే కర్మయోగానికి తొలిమెట్టు. 

ర్మబద్ధంగా నీ కర్మని నువ్వు నిర్వర్తించకపోతే స్వధర్మం నుంచి పారిపోయినట్టే. దీనివల్ల కీర్తి నశిస్తుంది, జనం నీవైపు వేలెత్తిచూపుతారు. ఆ పరిస్థితి మరణం కంటే బాధాకరం. 

కోపంలోంచి అవివేకం పుడుతుంది. అవివేకం కారణంగా మతిమరుపు మొదలవుతుంది. ఆ ప్రభావంతో బుద్ధి నశిస్తుంది. దీంతో మనిషి పతనం సంపూర్ణం అయినట్టే. 

గభగ మండుతున్న నిప్పు, కట్టెలని ఎలా బూడిద చేస్తుందో, జ్ఞానమనే అగ్ని కూడా సమస్త కర్మల్నీ భస్మం చేస్తుంది. సృష్టిలో కర్మయోగానికి సమానమైంది లేదు. 

కామం, క్రోధం, లోభం ఈ మూడూ నరకద్వారాలు. మనిషి పతనానికి కారణం అవుతాయి. వాటి నుంచి బయటపడిన మనిషి సర్వోన్నతుడు అవుతాడు. 

మ్రత, నిగర్వం, అహింస, ఓర్పు, నిజాయతీ, గురుసేవ, శారీరక-మానసిక శుభ్రత, ఇంద్రియ నిగ్రహం, అహంభావం లేకపోవడం, బంధాలకు అతీతంగా ఉండటం.. ఇవన్నీ వికాసానికి సోపానాలు. 

శుభ్రత, నిరాడంబరత్వం... మొదలైనవి శారీరక తపస్సులు. సత్యాన్ని మాట్లాడటం, వికాసాన్ని కలిగించే సంభాషణలు జరపడం, ఉత్తమ గ్రంథాల అధ్యయనం ... వాక్కుతో చేసే తపస్సులు. ప్రశాంతమైన చిత్తం, మనో నిగ్రహం, చక్కని భావాలు ... మానసికమైన తపస్సులు.

జీవితాన్ని యుద్ధతో పోల్చాడు భగవానుడు. అక్కడా పోరాటం తప్పదు. ఇక్కడా పోరాటం తప్పదు. యుద్ధస్వ - యుద్ధం చెయ్‌. విగత జ్వరః - ఎలాంటి అలజడీ లేకుండా...జీవన యుద్ధాన్ని నిర్భయంగా, నిశ్చలంగా కొనసాగించమంటాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ‘మయి సర్వాణి కర్మాణి సంన్యస్య’ - నీ కర్మలన్నీ నాకు వదిలిపెట్టు, నేనే చూసుకుంటా - అని భరోసా ఇస్తున్నాడు శ్రీకృష్ణుడు.
యజ్ఞార్థాత్‌ కర్మణాః అన్యత్ర లోకః అయమ్‌ కర్మ బన్ధనః ...మిగతా కర్మలన్నీ బంధ హేతువులే. ప్రతిఫలాన్ని ఆపేక్షించకుండా, ఓ యజ్ఞంలా పనిచేయడమే కర్మయోగం అని నిర్వచిస్తాడు గీతాచార్యుడు. ఫలాన్నో ప్రసాదాన్నో సమర్పించి ‘సర్వం కృష్ణార్పణమస్తు’ అని ఎలా అంటామో..అలానే, మనం చేసిన కర్మల్ని పరమాత్మకు నైవేద్యంగా ఇచ్చేయాలి. నైవేద్యమనేది ఎంత కమ్మగా ఉన్నా, మనం ఎంత ఆకలిమీదున్నా ... మొత్తం తినేయం! ఆత్మీయులతో పంచుకుంటాం. ‘ఈశ్వరార్పణ బుద్ధి’ అంటే అదే. ‘సమర్పణ’ చేయగానే కర్మ మీద మనకు ఎలాంటి అధికారమూ ఉండదు. ఆ ఫలితం మనది కాదు, ఆ ప్రభావం మనల్నేమీ చేయదు.
దీనివల్ల మరింత సమర్థంగా, మహా ప్రశాంతంగా కర్మల్ని నిర్వర్తిస్తాం. ఉత్పత్తిలో నాణ్యత పెరుగుతుంది, పని వేగవంతం అవుతుంది. దానివల్ల నీకూ మంచిది, నీ సంస్థకూ మంచిది, సమాజానికి కూడా మంచిది. ఫలితాన్ని ఆశించో ప్రయోజనాన్ని కోరుతూనో చేసే సకామకర్మలో...అనుకున్న ప్రకారం జరగదేమో అన్న భయం ఉంటుంది. ఆ భయంలోంచి పరిమితులు పుట్టుకొస్తాయి. సాహసాలకు ధైర్యం చాలదు. ఆ పనిముందు బానిసలం అయిపోతాం. అదే, నిష్కామకర్మనైతే యజమానిలా స్వేచ్ఛగా ధైర్యంగా పనిచేస్తాం. ఫలితాల జంకు ఉండదు, గెలుపు ఓటముల దోబూచులాట ఉండదు. స్వేచ్ఛ ఉన్నచోట సృజన ఉంటుంది, నైపుణ్యం వెల్లివిరుస్తుంది. వూగిసలాటకు ఆస్కారమే లేదు కాబట్టి...నేరుగా లక్ష్యం మీదే గురిపెడతాం. గొప్పగొప్ప సంస్థలన్నీ అద్దాల భవంతుల్లో పుట్టలేదు, వ్యవస్థాపకుల్లో మేనేజ్‌మెంట్‌ దిగ్గజాలెవరూ ఉండరు. ఆ ప్రయత్నంలో ఎలాంటి భారీ అంచనాలూ ఉండవు. ఏ క్యాంపస్‌ డార్మెటరీలోనో, నిరుద్యోగి ఇరుకిరుకు గదిలోనో ప్రాణంపోసుకుంటాయి - అది ఫేస్‌బుక్‌ అయినా, గూగుల్‌ అయినా. అవార్డు కోసమే తీసిన సినిమాలకు అవార్డులు రావు, ఎందుకంటే నిర్మాణ సమయంలో నాణ్యత మీద కంటే అవార్డు మీదే దృష్టి ఎక్కువగా ఉంటుంది. మంచి సినిమా తీయాలన్న ఉద్దేశంతో తీస్తే మాత్రం... అవార్డులకు అవార్డులూ కలెక్షన్లకు కలెక్షన్లూ!
దక్షిణ కొరియా లాంటి చిన్నచిన్న దేశాలు కూడా తలసరి ఉత్పత్తిలో భారత్‌ను మించిపోతున్నాయి. కారణం...ఆదేశాల్లోని పని సంస్కృతే. పనిని వాళ్లు ప్రేమిస్తారు. దైవంగా భావిస్తారు. కానీ మనలో చాలామంది దృష్టిలో పని అంటే ఓ శిక్ష. పనిచేయడం అంటే ఓ శాపం. ఏ పనీ చేయకపోవడాన్నే గొప్పని అనుకుంటాం. కాబట్టే...కర్మ, పని అన్నమాట ‘ఖర్మ’గా రూపాంతరం చెందింది. ఎంత దుస్థితి! భగవంతుడు ఆ మెట్టవేదాంతాన్ని గర్హిస్తాడు. బద్ధకాన్ని వదులుకోమంటాడు. శ్రమజీవన సౌందర్యాన్ని కీర్తిస్తాడు. కర్మచేయడానికి నిరాకరించిన అర్జునుడిని పిరికివాడివంటూ చివాట్లు పెడతాడు.
‘నేను’ నేను కాదు... 
‘అహంకార విమూఢాత్మా - కర్తా అహమ్‌ ఇతి మన్యతే ... అహంకారులు అన్ని పనులూ తామే చేస్తున్నామని మిడిసిపడుతుంటారు. దీనికంతా కారణం అజ్ఞానమే. రోడ్డు మీద వెళ్తుంటాం. ఎవరో ఓ రాజకీయనాయకుడి ఫ్లెక్సీ మీద బురద జల్లుతుంటారు. మనం పెద్దగా పట్టించుకోం. కాస్త ముందుకెళ్లాక... మన అభిమాన హీరో సరికొత్త సినిమా పోస్టరు మీద ఆకతాయి కుర్రాళ్లు మసి పూస్తున్న దృశ్యం కనిపిస్తుంది. మనకు కోపం వచ్చేస్తుంది. ఆవేశంగా దెబ్బలాటకు దిగుతాం. అంతలోనే ఎంత తేడా! అందుకు కారణం ‘నా’ అన్న పాశమే! దాన్నే ముందుగా వదిలించుకోమంటాడు కృష్ణ భగవానుడు. చిన్నచిన్న ‘నా’లతో మొదలైన బంధనం ...పెద్దపెద్ద ‘నా’లకూ విస్తరిస్తుంది.
ఏ మంత్రిగారికో ఫోన్‌ చేయండి, ‘నేను హోమ్‌ మినిస్టర్‌ని మాట్లాడుతున్నా’ అంటాడు. ఏ ఉన్నతాధికారినో కలవండి. ‘నేను సీనియర్‌ ఐఏఎస్‌ని’ అంటూ భుజాలు ఎగరేస్తాడు. కర్మలో కొట్టుకుపోవడమంటే అదే. కొండచిలువ మేకపిల్లని గుటుక్కుమనిపించినట్టు ...ఆ కర్మ అతన్ని మింగేసింది. ఏ అనుకోని సంఘటనో జరిగి అధికారం వూడిపోయిందా...ఇక తట్టుకోలేరు. ఇంకో పార్టీవైపు పరుగులు పెడతారు. మరో నాయకుడి పంచన చేరతారు. బతుకంతా అభద్రతే. కర్మకు అతుక్కుపోవడం వల్ల ఇలాంటి నష్టాలే ఉంటాయి. కర్మయోగి తాను చేస్తున్న కర్మలో బందీ అయిపోడు.
కన్నడంలో ‘మనె’ అంటే ఇల్లు. ‘సుమ్మనె’ అంటే ఉత్తుతి. కన్నడ నటుడు ఉపేంద్ర తాను ముచ్చటపడి కట్టించుకున్న భవంతికి ‘సుమ్మనె’ అని పేరు పెట్టుకున్నాడు. ‘ఈ బంగళా నా తాత్కాలికమైన నివాసం మాత్రమే...’ అన్న నిగూఢార్థం ఉందా మాటకు. ‘నా ఇల్లు’ అనుకోవడంలో మమకారం ఉంది, దాన్ని వదిలేసుకోవడంలో కర్మయోగం ఉంది. ఐహికమైన సుఖాలకు దూరంగా ఉండమని కృష్ణుడు ఎక్కడా చెప్పలేదు. కార్లో తిరుగు, ఎవరొద్దన్నారు? కానీ ‘నా కారు’ అన్న మమకారం వద్దు. నీ దృష్టిలో అదో రవాణా వాహనం మాత్రమే. ఒంటినిండా ఆభరణాలు ధరించు. అంతకు మించిన ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఆ లోహపు ముక్కలు కొనుక్కోడానికి అడ్డదార్లు తొక్కొద్దు.
శరీరమైనా అంతే...‘నా శరీరం’ అన్న మమకారమే వద్దు. రామాయణంలో జనకమహారాజుకు విదేహుడని పేరు. దేహాన్ని గెలిచినవాడని ఆ మాటకు అర్థం. తనను తాను సార్వభౌముడిగా ఎప్పుడూ భావించుకునేవాడు కాదట. తానొక ఆత్మననే స్పృహతోనే మెలిగేవాడట. అలా అని, రాజవైభోగాల్ని దూరంగా పెట్ట్టలేదు. యుద్ధమైనా, పాలనైనా అతని దృష్టిలో ఓ కర్మయోగమే. ఏ మురికీ అంటుకోకుండా జీవించాడు. అద్వైత యోగి రమణుడు కూడా మూర్తీభవించిన కర్మయోగే. ఓసారి ఆయన ఒంటిమీద రాచపుండు పుట్టింది. ఈగలూ దోమలూ వాలుతూ ఉంటే...కనీసం చేత్తో విదిలించే ప్రయత్నమైనా చేసేవారు కాదట. ‘ఎంత ఆకలిమీద ఉన్నాయో, తిననివ్వండి పాపం!’ అనేవారట. శిష్యుల బలవంతం మీద శస్త్రచికిత్స చేయించుకున్నా...మత్తుమందు తీసుకోడానికి నిరాకరించారు. సూదులతో గుచ్చుతున్నా, కత్తులతో చీలుస్తున్నా... మొహం మీద చిరునవ్వు చెదరలేదు.
విజయం వరించినప్పుడు నానా హంగామా చేస్తాం. ఓటమి వార్త తెలియగానే కన్నీళ్లు పెట్టుకుంటాం. కారణం...గెలుపు ‘నాది’ అనుకుంటాం. దక్కకపోతే బాధ కలుగుతుంది. ఓటమి ‘నాది కాదు’ అన్న భరోసాతో ఉంటాం. హఠాత్తుగా నెత్తిన ఎక్కేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. నిజానికి గెలుపులో తీపి లేదు. ఓటమిలో చేదూ లేదు. ఆ రెండూ పనితోపాటు వచ్చిన ఆనందవిషాదాలు కాదు. కర్మతో మనల్ని మనం ముడిపెట్టుకోవడం వల్ల ఏర్పడిన ఇబ్బందులు. ఆగస్టు పద్నాలుగో తేదీ అర్ధరాత్రి సమయానికి...నెహ్రూ ఉద్వేగంగా పార్లమెంటులో ఉపన్యసిస్తున్నాడు. నేతలంతా దేశవ్యాప్తంగా పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. సామాన్యులు మిఠాయిలు పంచుకుంటున్నారు. మహాత్ముడు మాత్రం మతఘర్షణల్లో గాయాలపాలైన వారిని ఓదార్చే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కారణం... ఆయనకు కర్మ ఫలితం పట్ల ఆసక్తి లేదు. అదే కర్మయోగం.
మనసును గెలిస్తేనే... 
గణితం నేర్పించే బడులు ఉన్నాయి, సైన్సు బోధించే బడులు ఉన్నాయి. కానీ, మనసుకు శిక్షణ ఇవ్వడానికి ఒక్కటంటే ఒక్క సంస్థా లేదు. కాబట్టే, మన దేశంలో మానసిక రుగ్మతలు అధికం అవుతున్నాయి. వీధుల్లో సైకోలు స్వైర విహారం చేస్తున్నారు.
‘అసలు మనిషి దుష్కర్మలవైపు ఎందుకు పరుగులు తీస్తున్నాడు?’ - అర్జునుడి ప్రశ్నకు జవాబు చెబుతున్న సమయానికి ఆదినారాయణుడు.... డాక్టర్‌ శ్రీకృష్ణమూర్తి, సైకాలజిస్టుగా మారిపోతాడు. మనసు ప్రభావాన్ని హృదయానికి హత్తుకునేలా వివరిస్తాడు. నిజానికి, కర్మయోగమంటే మనసు మీద మనిషి గెలుపే! ప్రయత్నం వరకూ నాదే, ఫలితం భగవానుడిదే...అనుకోవాలంటే ఎంత మనో సాధన కావాలి? కానీ ఆ ప్రయత్నంలో ఎన్నో అవరోధాలు. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు...‘మహాపాప్మా’ ...మనిషిని పాపానికి ప్రోత్సహిస్తాయి. మురికితో అద్దమూ, మాయతో గర్భస్థ శిశువూ, పొగతో అగ్నీ కప్పబడినట్టు...కోరికలు జ్ఞానాన్ని కప్పేసి ఉంటాయి. కోరికలు నశించేకొద్దీ జ్ఞానం బహిర్గతం అవుతుంది. ‘ఇంద్రియాలు, మనసు, బుద్ది - ఇదీ వరుస. చెడు ముందుగా ఇంద్రియాల్ని జయిస్తుంది. ఆతర్వాత మనసును కలుషితం చేస్తుంది. ఏదో ఒకరోజు బుద్ధినీ బురదలోకి లాగేస్తుంది. ఇంద్రియాల్ని అధీనంలో ఉంచుకోగలిగితే - నీ మీద నువ్వు సగం విజయం సాధించినట్టే’ అంటున్నాడు. నిజమే, మనోజయమే మహాజయం! మనసును గెలిస్తే మహాసామ్రాజ్యాల్ని గెలిచినట్టే. ‘మహాబాహో కామరూపం దురాసదమ్‌’...వీరాధివీరుడైన అర్జునుడా! ముందు నీలోని శత్రువును జయించు, ఆతర్వాత అక్షౌహిణులకొద్దీ సైన్యాన్ని ఓడించడం పెద్ద సమస్య కాదు అని ధైర్యం చెప్పాడు. నిన్ను అంతరిక్షానికి తీసుకెళ్లినా, అధఃపాతాళానికి తొక్కేసినా - అది మనసు వల్లే. ఆ మనసును దార్లో పెట్టుకో. దాన్నెంత సమర్థంగా ఉపయోగించుకుంటే... అంత ఉన్నతిని సాధిస్తావు, లౌకికంగా అలౌకికంగా!
సమాజం కోసం.... 
ఇచ్చిపుచ్చుకోవడం అన్న భావన సృష్టి నిర్మాణంలోనే ఉంది. ఆదిలో మనిషిలోనూ ఉండేది. వికృతంగా ఆలోచిస్తూ ఆ ప్రకృతి సిద్ధమైన గుణాన్ని పోగొట్టుకున్నాడు. పిచ్చుక కొండల్లో కోనల్లో గింజల్ని ఏరుకుని తింటుంది. ఆకాశంలో ఎగురుతున్నప్పుడు తన పాదాలకు అంటుకున్న చిన్నచిన్న విత్తనాల్ని అక్కడక్కడా జారవిడుస్తుంది. అవే మొలకెత్తి మొక్కలై చెట్లయి మహావృక్షాలు అవుతాయి. అలా ప్రకృతికి తిరిగి ఇస్తుంది. నదులూ అంతే. వర్షం రూపంలో తనలో కలిసిపోయిన నీటిని... ఆవిరి ద్వారా మేఘాలకు అందించి, మళ్లీ వర్షాలు రావడానికి కారణం అవుతుంది. మనిషే... మహాస్వార్థంగా వ్యవహరిస్తున్నాడు. పుచ్చుకోవడం తన హక్కని అనుకుంటున్నాడు, ఇవ్వడం తన బాధ్యతే కాదని తప్పించుకుంటున్నాడు. ఫలితంగా ప్రకృతిలో సమతౌల్యం దెబ్బతింటోంది. సహజవనరులు హరించుకుపోతున్నాయి. ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. రుతువులు గతి తప్పుతున్నాయి. ‘ఇష్టాన్‌ భోగాన్‌ హి ఓ దేవా దాస్యన్నే యజ్ఞ భావితాః’ - ప్రకృతికి చెందాల్సింది ప్రకృతికి ఇస్తే, ప్రకృతి నీకు చెందాల్సిందేదో ఇస్తుంది. సమాజం విషయంలోనూ ఈ నియమమే వర్తిస్తుంది. ‘పరస్పర భావయన్తః’...ఒకరికొకరు సహకరించుకోవాలి. కర్మయోగంలో ఇదో కోణం.
సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వన్తి భారత
...కర్మయోగీ, కర్మయోగి కానివాడూ ఇద్దరూ మనుషులే. ఇద్దరూ కష్టపడే పనిచేస్తారు. కానీ ఇద్దరి జీవన దృక్పథాలూ వేరు. ఒకరు సమాజం గురించి ఆలోచిస్తారు, మరొకరు తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు. నలుగురి గురించి ఆలోచించేవారి జీవితమే ధన్యం. కర్మయోగం అంటే - సమాజానికి ఉపయోగపడే పని కూడా. సమాజంతో పంచుకోగా మిగిలిందే నువ్వు అనుభవించాలి. అమృతం దేవలోకంలోనో మరెక్కడో లేదు. నువ్వు సమాజానికి అర్పించగా మిగిలిన సంపదే అమృతమంటే. జుకెర్‌బర్గ్‌ తనకు తాను మిగుల్చుకున్న ఒక శాతం ఫేస్‌బుక్‌ వాటా...అచ్చమైన అమృతమే! జుకెర్‌ అచ్చమైన కర్మయోగే. అలాంటివారిని ఏ కర్మా అంటుకోదు. రాజకీయ నాయకుల వేలకోట్లు అవినీతి సొమ్ము భోషాణాలు... అచ్చమైన విషకుంభాలు. ‘నీ కోసమే నువ్వు పోగేసుకునే సొమ్ము పాపంతో సమానం! నువ్వు తినేది అన్నం కాదు, విషాహారమని గుర్తుంచుకో. ఆ రక్తపు కూడు నీకెందుకు?’ - అని హెచ్చరిస్తాడు గీతాచార్యుడు. పంచుకోవడం నీ గొప్పతనమేం కాదు, అదో బాధ్యత. ఆ దానాల గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పన్లేదు. దానం చేసే అవకాశాన్ని నీకిచ్చినందువల్ల ... నువ్వే అతనికి రుణపడి ఉన్నావు - అని స్పష్టం చేస్తాడు. 

ఆధ్యాత్మికతకూ అతీతం! 
- స్వామి వివేకానంద 
నిస్వార్థంతో చేసే మంచిపనుల ద్వారా మోక్షాన్ని పొందడానికి ఏర్పడ్డ నైతిక మత వ్యవస్థ కర్మయోగం. కర్మయోగి ఏ సిద్ధాంతాన్నీ విశ్వసించాల్సిన పన్లేదు. భగవంతుని అస్తిత్వాన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఆత్మ విచారణతో నిమిత్తం లేదు. స్వార్థరాహిత్యమే అతని పరమావధి. జీవితంలో ప్రతి క్షణం ఈ స్వార్థరాహిత్య అనుభూతిని పొందుతూ ఉండాలి. జ్ఞాని వివేకంతో, భక్తుడు ప్రేమతో పొందుతున్న దాన్నే కర్మయోగి తన సేవ ద్వారా పొందుతాడు.
(స్వామీజీ ‘కర్మయోగం’ నుంచి)
నాయకుడిగా... 
కర్మయోగి అనేవాడు నాయకత్వానికి నిలువెత్తు నిర్వచనం. సాక్షాత్తూ కర్మయోగే పాలకుడైతే ఆ జాతి తరించినట్టే! యద్య దాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.. గొప్పవాడు ఏం చేస్తే మిగిలినవాళ్లూ దాన్నే అనుసరిస్తారు. ఆ నాయకుడి విలువలు ప్రజల్లోనూ ప్రతిబింబిస్తాయి. ఆ నాయకుడి నైతిక పతనం ప్రజల్నీ పాతాళానికి తొక్కేస్తుంది. మహావిష్ణువు సర్వశక్తిమంతుడే! అయినా, రాక్షస సంహారం కోసం పది అవతారాలు ఎత్తాలా? అన్నన్ని కష్టాలు అనుభవించాలా - అనిపిస్తూ ఉంటుంది. ఆ రహస్యాన్నీ గీతలో వివరించాడు. ‘నేను ఏమీ చేయకుండా ఉంటే, అందరూ నన్నే అనుసరిస్తారు. బద్ధకస్తులుగా తయారవుతారు. అది నాకిష్టం లేదు. ఓ ఆదర్శాన్ని ప్రపంచానికి చాటడానికే నా కర్మలన్నీ’ అంటాడు. కాబట్టే, పాలకడలిలో పవళించేవాడు, పూతన చన్నుల చేదు దిగమింగుకున్నాడు, శేషతల్పశాయి కాళింగుని పడగల మీద తకధిమి నృత్యాలు చేశాడు, పాండవుల గుర్రాలు కడిగాడు, అర్జునుడి తేరు తోలాడు - అవన్నీ నిష్కామ కర్మలే. మానవజాతికి మార్గసూచికలే.
* * *
అర్జునుడు... 
యుద్ధం చేశాడు. కౌరవుల్ని ఓడించాడు. సోదరులతో కలిసి రాజ్యభారం స్వీకరించాడు. 
అది కర్మయోగం. 
గౌతమ బుద్ధుడు... 
రాజ్యాన్ని వదులుకున్నాడు, భార్యాపిల్లల్ని కాదనుకున్నాడు. అడవుల బాట పట్టాడు. 
అదీ కర్మయోగమే! 
ఒకరు స్వీకరించారు. ఒకరు వదులుకున్నారు. 
కర్మయోగికి ... ఆశ్రమ జీవితమైన అధికారపీఠమైనా ఒకటే. 
  
 

Thursday, 17 December 2015

GODA KALYANAM AT TIRUMALA NADA NEERAJANAM

తిరుమ‌ల శ్రీ‌నివాసుని స‌న్నిధిలో శ్రీ రంగ‌నాథునిగా

తిరుమ‌ల శ్రీ‌నివాసుని స‌న్నిధిలో శ్రీ రంగ‌నాథునిగా నాట్యం చేసే అవ‌కాశం ఆ గోవిందుని అనుగ్ర‌హంతో మా గురువు గారూ శ్రీ భాగ‌వతుల వెంక‌ట‌రామ శ‌ర్మ‌గారి ఆశీస్సుల‌తో క‌లిగింది. ది.17.12.15న సాయంత్రం అయిదున్న‌ర గంట‌ల‌కు తిరుమ‌లేశుని ఆల‌యం ఆనంద నిల‌యం ఎదురుగా ఉన్న నాద‌నీరాజ‌నంలో గోదా క‌ళ్యాణంలో నేను శ్రీ రంగ‌నాథునిగా నాట్యం చేశాను....                 మీ దాస‌రి భార్గ‌వి ప్ర‌త్యూష‌.