వైద్యుడి తీర్పు... అనగనగా విరాటపురం అనే రాజ్యాన్ని విరాటుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజుకు విపరీతంగా చర్మ వ్యాధి వుండేది. దేశం నలుదిక్కుల నుండి ఎందరో వైద్యులు వచ్చి అతనికి వైద్యం చేసేవారు. కాని ఎన్ని రకాల మందులు వాడినా లాభం లేకపోయింది. విరాటుడి వ్యాధి గురించి విని, నందనుడు అనే ఒక వైద్యుడు రాజును కలవడానికి వచ్చాడు. విరాటుడు నందనుడిని కలవడానికి అంగీకరించి తన సభలోకి రమ్మనమని ఆదేసించాడు. నందనుడు "ప్రభూ, మీరు ఏరకమైన మందులు వాడకుండానే మీ వ్యాధిని నేను కేవలం వారం రోజులలో తగ్గిస్తాను" అని అన్నాడు. ఈ మాట విన్న విరాటుడు ఉప్పొంగిన ఆనందం తో ఇదే నిజమైతే నీ తరం అంతటినీ వజ్ర వైడూర్యాలతో సత్కరిస్తాను అని మాట ఇచ్చాడు. అంతేకాదు తన రాజ్యం లో ప్రధాన వైద్యుడిగా నియమిస్తానని కూడా మాట ఇచ్చాడు. మరుసటి రోజున వస్తానని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు నందనుడు. మరుసటిరోజున తెల్లవారగానే నందనుడు ఒక పెద్ద కర్రను తీసుకుని దానికి ఎన్నో రకాల మందులను పొడిచేసి తడిపి ఆ మిశ్రమాన్ని ఆ కర్రకు పట్టించాడు. దానిని ఎండబెట్టి, రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. నందనుడిని చూసి రాజు "నందనా నా వ్యాధి గురించి ఏమి చెయ్యబోతున్నావు" అని అడిగాడు. నందనుడు "ప్రభూ మీరు రోజూ ఒక గంట ఈ కర్రతో కర్రసాము చెయ్యాలి. మీకు చేతులు బాగా వేడెక్కాయి అనిపించిన వెంటనే చక్కగా ఒళ్ళంతా రుద్దుకుని స్నానం చేసి ఒక గంట విశ్రాంతి తీసుకోవాలి" అని చెప్పాడు నందనుడు. రాజు నందనుడు చెప్పినట్టు రోజూ ఆ కర్రతో కర్రసాము తన భటులతో చేసేవాడు. కాసేపటికి చేతులు వేడెక్కుతున్నాయి అనిపించేసరికి వెళ్లి స్నానం చేసి విశ్రాంతి తీసుకునే వాడు. అలా ఒక వారం తరువాత విరాటుడి వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తనని తానే నమ్మలేని విరాటుడు నందనుడిని పిలిపించి చక్కటి వజ్ర వైడూర్యాలతో బంగారు ఆభరణాలతో సన్మానం చేసి పంపాడు. తాను చెప్పినట్టే తన రాజ్యం లో నందనుడికి ముఖ్య వైద్యుడిగా నియమించాడు. నందనుడు ఎంతగానో ఆనందించాడు. కాని ఇదంతా చుసిన మంత్రి మహాపతికి నందనుడికి అంత గొప్ప సన్మానం చెయ్యటం బహుమతులు ఇవ్వడం నందనుడు అంతటి కీర్తి సంపాదించడం నచ్చలేదు. రెండురోజులు ఆగి మెల్లగా రాజు వద్దకు వెళ్లి "రాజా! మీరు మరీ తొందరపడినట్టున్నారు. ఆ నందనుడికి అంత గొప్పగా బహుమతులు ఇవ్వటం ఎందుకు? అంత పెద్ద సన్మానం చెయ్యటం ఎందుకు? అతను ఏం చేసాడని? మీచేత ఏ మందులూ తినిపించాకుండానే మీ వ్యాధిని నయం చేసాడంటే మీకు ఎదో మందు పెట్టి మిమ్మల్ని హతమార్చడని నమ్మకం ఏంటి? అయినా నందుడు ఒక గూఢచారి అని నా అనుమానం" అని అంటుండగానే రాజు "ఆపు మహాపతి ! నందనుడు అలాంటివాడు కాదు అని నేను నమ్మాకే అతనికి నా వ్యాధిని నయం చేసే అవకాశం ఇచ్చాను. ఇలాంటి మాటలు చెప్పి నా సమయాన్ని వృధా చెయ్యకు వెళ్ళు" అని ఆజ్ఞాపించాడు. అయినా మహాపతి పట్టిన పట్టు వదలనట్టు అదేపనిగా నందనుడి మీద వున్న ఉక్రోషంతో రాజు దగ్గర అతను ఒక గూడచారి అని మరీ మరీ చెప్పడం తో రాజు కూడా ఆలోచనలో పడ్డాడు. విరాటుడు ఆలోచిస్తూ "నిజమేనేమో! ఏ మందు ఇవ్వకుండానే నా వ్యాధిని నయం చెయ్యగల నందనుడు నాకు తెలీకుండా ఎదో ఒక మందు ఇచ్చి నన్ను చంపడని నమ్మకం లేదు" అని ఒక నిశ్చయానికి వచ్చాడు. మరుసటి రోజు నందనుడిని పిలిపించి, అతని తల నరకమని ఆదేశించాడు విరాటుడు. ఇది చూసి నివ్వెరపోయిన నందనుడు తను అలాంటివాడు కాదని ఎంత గానో వేడుకున్నాడు. రాజు తలిస్తే దెబ్బలకి కొదవా అన్నట్టు.. విరాటుడు తన నిర్ణయంలో మార్పులేదన్నట్టుగా చూసాడు. ఇక చేసేదేమీ లేక రాజు వద్దకు వచ్చి ఇలా అన్నాడు. "రాజా! మీ మాటకి బదులు చెప్పే అధికారం, ధైర్యం రెండూ నాకు లేవు. కాని నాకొక్క రోజు గడువు ఇవ్వండి. నాదో కోరిక. నేను మీకోసం ఒక పుస్తకం రాస్తున్నాను. ఆ పుస్తకాన్ని మీకే అంకితం ఇవ్వాలని నా కోరిక. ఆ పుస్తకం వెంటనే ముగించి మీకు ఇస్తాను. ఆ పుస్తకం లో ఒక్కొక్క పుట తెరుస్తూ అందులో వున్న ప్రశ్నలను అడిగితే తెగిపడిన నా తల వాటికి సమాధానం ఇస్తుంది". ఇది విన్న విరాటుడు ఆ వింత ని చూడాలని ఎంతో ఉబలాటపడ్డాడు. సరే అని ఇద్దరు భటులని ఇచ్చి నందనుడి ఇంటికి తిరిగి పంపాడు. మరుసటి రోజు అందరూ రాజ సభకి చేరుకున్నారు. ఆ పుస్తకం చూడాలని రాజుతో బాటు ప్రజలకి కూడా ఎంతో కుతూహలంగా వుంది. నందనుడు వచ్చి ఒక పెద్ద బరువైన పుస్తకాన్ని రాజుకి ఇచ్చాడు. "ఇప్పుడు నా తలను ఖండించవచ్చు" అని అన్నాడు. రాజు ఆజ్ఞ మేరకు భటులలో ఒకరు నందనుడి తలను నరికారు. నందనుడి తల సరిగ్గా రాజు కూర్చున్న ప్రదేశం ముందు వచ్చి పడింది. రాజు తో నందనుదడి తల "రాజా! పుస్తకం లో ఆరవ పుటని(Page) తెరవండి" అని పలికింది. రాజు మొదటి పుట తెరిచి రెండవ పుట తెరవబోతే అది అంటుకుని సరిగ్గా రాలేదు. రాజు తన వ్రేలిని నోటిదగ్గర తడిచేసి రెండవది తెరిచాడు. అలా ఆరు పుటలను నోటిదగ్గర తడి చేసి తెరిచాడు. కానీ తీరా ఆ ఆరవ పుటలో ఏమి రాసి లేదు. రాజు ఆశ్చర్యపోయి నందనా ఇందులో ఏమి రాసి లేదు అని అన్నాడు. ఇది విన్న నందనుడు అన్ని తెరిచి చుడండి అని అన్నాడు. అలా అన్ని పుటలను తెరచి చూస్తున్న రాజుకు కాసేపటికి కళ్ళు మూతలు పడటం మొదలయ్యింది. నందనుదడితో అదే ప్రశ్న వేసాడు. అప్పుడు నందనుడు "ప్రభూ! మీకు కళ్ళు మూతలు పడటానికి కారణం నేను ఆ పుస్తకానికి విషం పూసాను. ఏది మంచో ఏది చెడో, ఎవరు మంచో, ఎవరు చెడో గ్రహించలేని రాజు వుండి ఈ ప్రజలకు ఎం లాభం. అయినా పరోపకరికి కూడా ఎవ్వరు హాని చెయ్యని మన రాజ్యం లో మీరు రాజుగా వుండి మీకు సహాయం చేసిన నాకే కీడు తలపెట్టారు. అందుకే మిమ్మల్ని హతమార్చుతున్నాను" అని అన్నాడు. నన్ను ఎలాగోలా బ్రతికించు అని వేడుకున్న రాజుకు నా తలని మీరు అతికించగలరా అని అడిగి నందనుడు కన్ను మూసాడు. కాసేపటికి రాజు కూడా మరణించాడు. ఒక అతి ముఖ్యమయిన పదవిలో వుండి ఏది మంచి, ఏది చెడు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనే ఓక చిన్న ఆలోచనలేని రాజులకు ఇది మంచి గుణపాఠం అయ్యింది.
No comments:
Post a Comment